టీడీపీని ఇరకాటంలో పెట్టేలా వైసీపీ అస్త్రాలు !

అధికార వైసీపీ, టీడీపీలు వేటికవి ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. మూడురాజధానుల బిల్లును, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు బిల్లును అమోదించి అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ గట్టి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నారు. అధికార పక్షం ఆశలకు శాసనమండలిలో టీడీపీ గండికొట్టింది. చంద్రబాబు వేసిన రూల్‌ 71 ఎత్తుతో చిత్తయింది. దీంతో బిల్లులు మండలికి చేరకుండానే సెలక్ట్‌ కమిటీకి వెళ్లాయి. దీంతో షాక్‌ తిన్న ముఖ్యమంత్రి జగన్‌ అంతలోనే విపక్ష టీడీపీకి ఝలక్‌ ఇచ్చారు. ఏకంగా శాసనమండలినే రద్దు చేసేందుకు పావులు కదుపుతుండడంతో టీడీపీకి పాలుపోని పరిస్థితి నెలకొంది.

జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ఎండగట్టాలని టీడీపీ ఎత్తులు వేస్తున్నది. అందుకు సెంటిమెంట్‌ భావనలను రాజేయాలని చూస్తున్నది. 1986లో ఎన్టీఆర్‌ రద్దు చేసిన శాసనమండలిని ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి 2007లో పునరుద్ధరించారు. తండ్రి వైఎస్‌ ఆశయాలకే జగన్‌ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శనాలు సంధించడమేగాక, విస్తృతంగా ప్రచారం చేసి ఇరుకునపెట్టాలని భావిస్తున్నది. మరోవైపు టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని వైసీపీ కూడా అన్నివిధాలా సిద్ధమవుతున్నది. శాసనమండలిని పునరుద్ధరించిన నాడు దానిని వ్యతిరేకిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల చిట్టాను ముందుకు తీస్తున్నది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను సైతం సేకరించి చూపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Tags: AP LEGISLATIVE COUNCIL, chandrababu, cm jagan