ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఇప్పటికే రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను మోసగించారని, ఇప్పుడు మళ్లీ కొత్తగా జోలె పట్టుకుని డ్రామా ఆడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భోగి మంటల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలను, రాజధాని ఏర్పాటుపై జీఎస్జీ రావు, బోస్టన్ నివేదికలను వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజధాని ప్రకటనకు ముందే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలతో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాలు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అందువల్లే రాజధాని తరలింపును ఆయన వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఆంధ్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని, చంద్రబాబుకు సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీగాక జొలె పట్టుకుని ఇప్పుడు మరో డ్రామాకు తెరతీశారని అమంచి విమర్శించారు.