సినిమా : జార్జి రెడ్డి
జానర్: బయోపిక్
నటీనటులు: సందీప్ మాధవ్, సత్య దేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, ముస్కాన్, మహాతి
దర్శకత్వం: జీవన్ రెడ్డి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: అప్పిరెడ్డి
భారతీయ సిని పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్‌లు రాజ్యమేలుతున్నాయి. టాలీవుడ్లో చరిత్ర మరిచిపోయిన వీరుల కథల ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి, మహానటి, సైరా వంటి సినిమాలు ఈ కోవలేకే వస్తాయి. వీటికి తోడు క్రీడాకారుల జీవిత కథతో సినిమాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు చరిత్ర మరిచిన విప్లవ విద్యార్థి వీరుడు జార్జిరెడ్డి జీవితకథతో సినిమా తెరకెక్కింది. జార్జిరెడ్డి పేరుతోనే వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉంది..? దర్శకుడు సినిమాను ఎలా తెరకెక్కించాడు.. నటీనటుల ప్రతిభ ఎలా చూపారో ఓసారి లుక్కేద్దాం.
కథ: అమ్మ ఈయన ఎవరు.. భగత్ సింగ్. ఎక్కడున్నారు?. చంపేశారు. మళ్లీ రారా?. చావు ఒక్కసారే వస్తుంది జార్జిరెడ్డి చిన్నప్పుడు తన తల్లితో జరిపిన సంభాషణలు. చిన్నప్పట్నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు. పోరాడతాడు. కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడాడు. అలాంటి వీరుడే జార్జిరెడ్డి. అయితే జార్జిరెడ్డి పుట్టింది కేరళలో.. విద్యనభ్యసించింది బెంగుళూరు, మద్రాస్‌లో. సినిమాలో జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జి రెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే అనుకోకుండా ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సీటీలో అడుగుపెట్టిన జార్జిరెడ్డి యూనివర్సిటీలో జరుగుతున్న ఆరాచకాలను ఎలా ఎదిరించాడు. ఎందుకు విద్యార్థి సంఘ నాయకుడయ్యాడు.. ఎందుకు ఓ విద్యార్థి సంఘానికి పురుడుపోసాడు అనేవి ప్రధానం. అయితే యూనివర్సిటీలో మాయ(ముస్కాన్), దస్తగిరి(పవన్), రాజన్న(అభయ్)లతో జార్జిరెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది?. అతడు ఎందుకు యూనివర్సిటీ, సమాజం కోసం పోరాడతాడు? ఓ సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఈ పోరాటంలో సత్య(సత్యదేవ్), అర్జున్(మనోజ్ నందం)లతో అతడికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అనేదే మిగతా కథ.
నటీనటులు: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈసినిమాలో హీరోగా నటించిన సందీప్ మాధవ్ జార్జిరెడ్డిగా జీవించాడు. సందీప్ బాడీ లాంగ్వేజ్, ధరించిన దుస్తులు, ఆయన నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా నటించాడు. జార్జిరెడ్డికి ప్రతిరూపంగా సందీప్ నిలిచాడంటే అతిశయోక్తి కాదు. తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్ ముస్కాన్ తన అందచందాలతో, తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇక అభయ్, యాదమరాజు, పవన్, సత్యదేవ్, మనోజ్ నందం తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్, యాదమరాజులు తమ ప్రతిభ మేరకు సందీప్‌కు దీటుగా నటించి సినిమాకు మూలస్థంభాలుగా నిలిచారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు జీవన్‌రెడ్డి ఇంతకు ముందు తెరకెక్కించిన చిత్రం దళం. ఈ సినిమాను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించి తన సత్తాను చాటుకున్నాడు. ఇప్పుడు జార్జిరెడ్డి సినిమాను ఎంతో ప్రతిభతో తెరకెక్కించి తనలోని ప్రతిభకు మరింత పదును పెట్టాడు అని చెప్పవచ్చు. సినిమాను మొదటి నుంచి చివరి దాకా ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించడంలో, సినిమాతో ఆనాటి రోజుల్లోకి తీసుకుపోవడంతో దర్శకుడు జీవన్ రెడ్డి విజయవంతం అయ్యాడనే చెప్పవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ ఎంతో బాగుంది. కెమెరాతో తన వృత్తికి తగిన న్యాయం చేశాడు కెమెరామెన్. సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక పాటలు కూడా సినిమాకు సరిపడే విధంగా ఉన్నాయి అని చెప్పవచు. స్క్రీన్‌ప్లే కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. సాంకేతిక విభాగం కృషి అభినందనీయం.
విశ్లేషణ : అసలు జార్జిరెడ్డి ఎవ్వరు.. ఎందుకు ఇక్కడి వచ్చాడు.. ఎందుకు పోరాటం చేశాడు.. ఎందుకు చనిపోయాడు.. అనే కథ తెలుసుకునేందుకు ఈ సినిమా దోహదపడింది. కనుమరుగు అవుతున్న ఓ విప్లవ వీరుడు కథను మరోసారి మనముందు ఉంచి పెద్ద సాహసమే చేసింది చిత్ర యూనిట్. జార్జిరెడ్డిని కేవలం విప్లవ సంఘాలు మాత్రమే గుర్తు చేసుకుంటూ, జయంతులు, వర్థంతులు నిర్వహిస్తున్నారు. జార్జిరెడ్డి అంటే కేవలం విప్లవమే అనేవారు ఇంతకాలం.. కానీ ఇప్పుడు దర్శకుడు జీవన్ రెడ్డి చేసిన సాహసంతో జార్జిరెడ్డి అంటే కొందరి వాడు కాదు.. అందరి వాడు అనేలా తీసారు. ఓ జీవిత కథను తెరకెక్కించే క్రమంలో చిన్న చిన్న లోపాలు సహాజంగానే ఉంటాయి.. ఇందులో ఆ లోపాలను ఎత్తి చూపేంతగా లేకపోవడం విశేషం.
రేటింగ్ : 3/5