రామ్ గోపాల్ వర్మ. సంచలనాలకు కేంద్ర బిందువు. టాలీవుడ్‌లో అయినా… బాలీవుడ్‌లో అయినా.. వర్మ అంటేనే ఓ సంచలనం. అలాంటి సంచలన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాకు ఇప్పుడు కష్టాలు కందిరీగల్లా చుట్టుముట్టాయి.. ఆ కష్టాల నుంచి తప్పించుకోలేరు.. తప్పించుకుందామంటే.. కష్టాలు వీడేలా లేవు.. ఇప్పుడు ఏమీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు రామ్.
వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ప్రతి సినిమా ఏదో కిరికిరితోనే తీస్తాడనే టాక్ ఉంది. ఇంతకు ముందు రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా పెద్ద సమస్యల నడమనే విడుదల అయింది. అది కూడా గత ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేసి భారీగా లబ్ధి పొందాలనే ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. కోర్టు ఏపీలో సినిమా విడుదలను అడ్డుకుని తెలంగాణలో మాత్రమే విడుదలకు అనుమతి ఇచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం లేకపోగా, నిర్మాత భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా కూడా రామ్ గోపాల్ వర్మకు ఓ పెద్ద సమస్యగానే మారింది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుకుంటుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గగ్గోలు పెడుతున్నాడు. కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ సమస్యలు వస్తాయన్న విషయం ముందునుంచి తెలుసు. దీనికి తోడు ఈ సినిమాపై కోర్టు సమస్యలు వస్తాయని తెలుసు. అయినా కూడా ఏదో మొండిదైర్యంతో సినిమాను తెరకెక్కించాడు. కానీ వర్మ ముందుగానే ఊహించినట్లుగా అటు కోర్టు సమస్యలు, ఇటు సెన్సార్ సమస్యల నుంచి తిప్పలు తప్పలేదు.
అయితే ఇప్పుడు వర్మకు ఈ సమస్యల నుంచి ఎప్పుడు గట్టెక్కుతాడో.. సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడో.. సినిమా కు ఎలాంటి కట్‌లు ఉండబోతున్నాయి.. అసలు పప్పులాంటి అబ్బాయి పాట ఉంటుందా.. ఉండదా అనే సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది. దీనికి తోడు చివరికి ఈ సినిమా పేరుపై అధికార వైసీపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా పేరు కూడా మారే అవకాశం ఉంది. సో రామ్ గోపాల్ వర్మ.. ఇకనైనా కళ్ళు తెరిచి భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు లేకుండా సినిమాలు రూపొందించాలని అభిమానులు కోరుతున్నారు.