కానిస్టేబుల్‌తో మూత్రం తాగించిన బీజేపీ ఎమ్మెల్యే

అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుందుడుకు స్వభావంతో కోరి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు.  ఇదీ బీజేపీ నాయకుల్లో మరీ కనిపిస్తున్నది. ఇప్పటికే ఇలాంటి వివాదాల్లో చిక్కి ఆ పార్టీ నేతలు కొందరు పదవులును కొల్పోయినా ఎలాంటి మార్పులు రావడం లేదు. అందుకు నిలువెత్తు ఉదాహరణే ఈ సంఘటన. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడి చేయడమేగాక అతనితో మూత్రం తాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతల తీరును అద్దం పడుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బర్ఖేరా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కిషన్‌లాల్‌ రాజ్‌ పుత్‌. ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరి నుంచి ఇటీవలే స్థానిక కానిస్టేబుల్‌ మోహిత్‌ ఒక ద్విచక్రవాహనాన్ని రూ. 50వేలకు కొనుగోలు చేశాడు. ఆ బైక్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి వెళ్లగా పత్రాలు సరిగా లేవని అక్కడి అధికారులు ఆ కానిస్టేబుల్‌ను తిప్పి పంపారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ తిరిగి ఎమ్మెల్యే అనుచరుడి వద్దకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని డిమాండ్‌ చేశాడు. అందుకు సమ్మతించిన ఆ నాయకుడు స్థానిక రాహుల్‌ పిలిబిత్‌ గేట్‌ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లాక సదరు నాయకుడు, ఎమ్మెల్యే కిషన్‌ లాల్‌ మేనల్లుడితో కలిసి కానిస్టేబుల్‌ మోహిత్‌పై దాడి చేశారు. అతని నుంచి బంగారు గొలుసు, డబ్బులు లాక్కున్నారు. కాల్పులు సైతం జరుపగా ఎలాగోలాగ తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా అసోం టోబ్‌ పోలీస్‌లోనే కానిస్టేబుల్‌పై మరోసారి దాడికి దిగారు. మూత్రం తాగాలని బలవంతం చేశారు. ఇదంతా చూస్తున్న పోలీసులు సైతం అడ్డుకోకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే సదరు కానిస్టేబుల్‌ కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్చే, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయం స్థానం వెంటనే ఎమ్మెల్యే, నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నది.