ఏపీ శాసనమండలి రద్దుకు జగన్‌ పావులు ?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో తెలుగు సినిమాను తలపిస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టాల బిల్లును పూర్తి మెజార్టీతో ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. శాసనసభలో పూర్తి మెజార్టీ ఉండడంతో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. అయితే శాసనమండలిలో చిక్కులు ఎదురవుతున్నాయి. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో వైసీపీకి 9 మంది సభ్యులు మాత్రమే ఉండగా, విపక్ష టీడీపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఆ బిల్లులు పాస్‌ కావడం ప్రశ్నార్థంగా మారింది. ఇప్పటికే దీనిపై చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి.

జిస్టేటివ్‌ కౌన్సిల్‌లో బిల్లులను ఎలాగైనా ఆమోదింప జేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతున్నది. అందుకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నది. ఒక దశలో మోజువాణి ఓటింగ్‌ నిర్వహించాలని, మరోసారి డీమ్డ్‌ టూ పాస్‌ కింద బిల్లును ఆమోదించాలని యోచించింది. ఇవేవీ సాధ్యం కాకపోతే సంఖ్యా బలం లేని మండలిని మొత్తంగానే రద్దు చేయాలనే యోచనలో వైసిపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. తద్వారా బిల్లులను ఆమోదానికి మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నది. ఈ అంశంపై నేటి రాత్రి ఏపీ కేబినెట్‌ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చర్చ రాజకీయాల్లో తీవ్ర సంచలన రేపుతున్నది.

ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు 1986లో శాసనమండలి వ్యవస్థను తొలిసారిగా రద్దు చేశారు. ఆ తరువాత 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిరిగి 2007 లో శాసనమండలి వ్యవస్తను పునరుద్ధరించారు. నాటి నుంచి కొనసాగుతున్నాయి. ఏపీ లెజిస్లేటివ్‌ కౌన్సిలో మొత్తం 52 మంది సభ్యులు ఉండగా, మరో ఆరుగురు నామినెట్‌ సబ్యులు కలుపుకుని మొత్తంగా 58 మంది ఉన్నారు. ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇక శాసనమండలిలో టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు.

Tags: AP LEGISLATIVE COUNCIL, chandrababu, jaganmohanreddy