ఏపీ మంత్రుల‌కు ప‌రీక్షా కాలం మొద‌లైంది…

ఏపీలో జగన్మోహన్ రెడ్డి తొలి ఆరు నెలల పాలన కాలం ప్రతి ఒక్కరి అంచనాలకు భిన్నంగా పాలనాపరమైన సంచలనాలతో దూసుకు వెళుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడిక‌క్కడ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని కట్టడి చేయడంతో ఎక్కడా అవినీతి అన్న మాట వినపడటం లేదు. తొలి ఆరు నెలల పాలన కాలంలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం నెరవేర్చారు. ఇక జగన్ ముందు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరీక్ష ఒకటే మిగిలి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను మంత్రులకు అప్పగించి సరైన ఫలితాలు చూపించని మంత్రులకు ఉద్వాసన పలకాలని జగన్ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్ కు కారణం అవుతుంది. వాస్తవంగా చూస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జడ్పిటిసి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయినందుకు గాను రాజశేఖర్ రెడ్డి నాడు త‌న కేబినెట్లో మంత్రులుగా ఉన్న మూలింటి మారెప్ప, మాగంటి బాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు జగన్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

మార్చి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని హైకోర్టుకు తెలిపింది ఏపీ సర్కార్. అంటే యేడాది ప‌నితీరుకు ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఓ ప‌రీక్ష కానున్నాయి. మంత్రి ప‌ద‌వులు పొందిన వారంతా రెండున‌రేళ్ల కాలానికి ప‌ని చేయాల‌ని.. త‌ర్వాత వీరిని త‌ప్పించి.. వీరి స్థానంలో కొత్త వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని జ‌గ‌న్ గ‌తంలోనే చెప్పారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత ప‌నితీరు స‌రిగా లేని వారిలో కొంద‌రిని జ‌గ‌న్ త‌ప్పించేస్తార‌ని టాక్‌..!

ఈ ఎన్నిక‌లు ప్ర‌భుత్వ తొలి యేడాది ప‌నితీరుకు కొల‌మానంగా ఉంటాయి కాబ‌ట్టి.. మంత్రులు కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఈ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ప‌ని చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నిక‌ల్లో ఎక్క‌డైనా అధికార పార్టీ గెలుపున‌కు ఇబ్బంది లేక‌పోయినా.. కొంద‌రు మంత్రుల్లో అల‌స‌త్వాన్ని గ‌మ‌నించే జ‌గ‌న్ ఈ కండీష‌న్ పెట్టిన‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాగైనా మంత్రులు కష్టపడి పనిచేస్తారని, ప్రభుత్వ కార్యక్రమాలు-పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారనేది జగన్ ఆశ.

Tags: AP, Cabinet Ministers, YS Jagan, ysrcp