ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్‌దేవగణ్‌ పాత్ర ఇదేనట!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రోజుకో వార్తతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. టాలివుడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. హిస్టరికల్‌ ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్‌స్టార్స్‌ రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమ్రంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించనున్నారు. వారి సరసన ఒలివియా మోరిస్‌, ఆలియభట్‌ మెరనుండగా, ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 75 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ సినిమాలో మిగతా నటులు ఎవరు ఏ పాత్రను పోషిస్తున్నారు ? అనే విషయాలపై స్పష్టత లేదు. తాజాగా ఈ చిత్రంలోని ఓ కీలకపాత్ర గురించిన వార్తలు బయటకొచ్చాయి.

ప్రముఖ బాలివుడ్‌ స్టార్‌ అజయ్‌దేవగణ్‌ ఆ పాత్రను పోషించనున్నారు. ఇటీవలే ఆ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌లో అజయ్‌ కూడా పాల్గొంటున్నాడు. సంబంధిత ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి ఈ విషయాన్ని చిత్ర బృందమే ప్రకటించింది. అయితే అజయ్‌ పోషిస్తున్న పాత్ర ఏంటనే ఉత్సుకత అందరిలో నెలకొంది. దీనిపై తాజాగా కొన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్‌ స్వాతంత్య్ర సమరయోధుడు, యువతర విప్లవనాయకుడు భగత్‌సింగ్‌ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఆ పాత్ర ద్వారా అల్లూరి, భీం పాత్రలు వెలివేట్‌ అవుతాయని తెలుస్తున్నది. ఈ పాత్ర సినిమాకే హైలట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. మరి జక్కన్న ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.

Tags: AJAY DEVAGHAAN, RRR Movie, SS Rajamouli