నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరాన్ని మాఫియా చేతుల్లో పెట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో సంచలనంగా మారాయి. ఈ మాఫియాకు అడ్డుకట్టే వేసే ధైర్యం పోలీసులకు ఉన్నా… వారి ఉద్యోగ భద్రత నేపథ్యంలోనే వారు వెనకడుగులు వేస్తున్నారని కూడా చెప్పారు.
ఐదేళ్లలోనే ఇక్కడ నలుగురు ఎస్పీలు మారారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు అయిన నెల్లూరు నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, బెట్టింగ్ మాఫియాతో పాటు పలు మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వచ్చమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవులకు వెళ్లాలి… మాఫియాలు కావాలంటే నెల్లూరుకు వెళ్లాలి అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు.
ప్రజలు సైతం ఈ మాఫియాల ఆగడాలు భరించలేక లోలోన కుమిలిపోతున్నారని ఆనం వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చే పోలీసు అధికారులు వచ్చినా… ఎమ్మెల్యేలు మాత్రం వాళ్లను ఉండనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఆనం చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీకే చెందిన ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉన్నట్టు జిల్లా వైసీపీ వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి.
కొద్ది రోజులుగా వైసీపీలో ఆనం ఇమడ లేకపోతున్నారని టాక్. టైం వచ్చినప్పుడల్లా ఆయన ఏదోలా తన అసంతృప్తిని బయట పెడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి నగర రాజకీయాల్లో కీలక మవుతున్నారు. ఈ క్రమంలోనే నగర సమీపంలోనే ఉన్న మరో ఎమ్మెల్యే, సదరు మంత్రి కలిసి నగరంలో ఆనం పెత్తనం కొనసాగుతున్న చోటల్లా చెక్ పెడుతూ వస్తున్నారు. చివరకు ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లినా ఆనంకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వమని చెప్పినా వాళ్లిద్దరు పెడచెవిన పెట్టేశారట. అందుకే ఆనం తన అసహనాన్ని ఇలా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు లిక్కర్ మాఫియాకు, మరో ఎమ్మెల్యే బెట్టింగ్ మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆనం వాళ్లను ఉద్దేశించి కూడా ఈ సెటైర్ వేశారని టాక్. మరి ఈ వ్యాఖ్యలు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ? చూడాలి.