అసెంబ్లీలో తొడగొట్టి సవాల్‌ విసిరిసిన ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి

తొలిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినిమాలను తలపించే సన్నివేశాలు కదలాడాయి. అధికార, విపక్ష నేతలు చమత్కార అస్త్రాలను సంధించుకున్నారు. ఆసక్తికర చర్చలు సాగాయి. ఇంకొకరు ఏకంగా తొడగొట్టి సవాల్‌ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. సభ ప్రారంభం కాగానే హాల్‌లోకి ప్రవేశించిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు మర్యాదపూర్వకంగా గుడ్‌మార్నింగ్‌ విష్‌ చేశారు. అదేవిధంగా విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు హాల్‌లోకి ప్రవేశిస్తూనే బ్యాడ్‌ మార్నింగ్‌ అంటూ స్పీకర్‌ను విష్‌ చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై తమ్మినేని అసహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ అనే గౌరవం లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు.

సభ ప్రారంభమైన అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశాలను లేవనెత్తారు. కొద్దిసేపు ప్రసంగించిన అనంతరం చదవడం ఇంకా ఉందని, మంచినీళ్లు తాగుతానని స్పీకర్‌ను కోరగా ” మీరు తాగితే తాగండి. కానీ మాతో తాగించకండి” అంటూ ఆయన చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. అనంతరం తన ఉపన్యాసాన్ని కొనసాగించిన మంత్రి బుగ్గన రాజధాని ప్రకటనకు ముందే అప్పటి టీడీపీ నేతలు తమ బినామీలతో వేలాది ఎకరాలను కొనుగోలు చేశారని వివరించారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి పేరును ఉదహరించారు. అంతే దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన సీటులోంచి పైకి లేచారు. ఆరోపణలు నిరూపించాలని తొడగొట్టి అధికార పక్ష నేతలకు సవాల్‌ విసిరారు. అనంతరం పోడియంలోకి వెళ్లి స్పీకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదిలా ఉండగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత సమావేశాలకు ముఖం చాటేస్తున్న చాలా మంది టీడీపీ నేతలు. ఆ పార్టీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం సభలో టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలూ ప్రత్యక్షమయ్యారు. వారిలో పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌, గంటా శ్రీనివాస్‌ తదితరులున్నారు. మరోక సన్నివేశం కూడా అందరినీ ఆకర్షించింది. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, సుద్దాళి గిరి సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే పక్కనే కూర్చొవడం విశేషం.

Tags: ap finance minister buggana rajendraprasad, tdp mla buchai chowdary