ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. తొలరోజునే అధికార, విపక్ష పార్టీల పరస్పర విమర్శలతో సభ హోరెత్తిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి బొత్స విరుచుకుపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం విపక్ష నేతకు చురకలంటించడం విశేషం. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి మొదటగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చను లేవనెత్తారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారయణ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయడు అడ్డుకున్నారు.
మంత్రి ఉపన్యాసం ముందుకు సాగకుండా పదేపదే జోక్యం చేసుకున్నారు. అదీగాక అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి బొత్స ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల వల్లే రాష్ట్రం ఈ దుస్థితికి దుస్థితి దిగజారిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ రాయలేదా? అని నిలదీశారు. ఇప్పుడు వారే అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో భూకుంభకోణాలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి జగన్, ఏపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారం సూచించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశిలిచ్చే అధికారం ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. దీంతో స్పీకర్ ఆయనపై మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మీరెెందుకు ఉలికి పడుతున్నారని టీడీపీ నేతలకు చురకలంటించారు. ఏ తప్పూ చేయనప్పుడు భయమెందుకు అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వానికి మరోసారి సూచించారు స్పీకర్. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఆదేశాలు కచ్చితంగా అమలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలు చేసే అధికారులున్నాయని ఆయన ముక్తాయింపునిచ్చారు.