ఏపీ కష్టాల్లో కూరుకుపోయిందని, రాజధాని ఏర్పాటు సంక్షోభంలో పడిపోయిందని, అందుకు ప్రతి ఒక్కరి నినాదం సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి కావాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతిని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, తనయుడు నారా లోకేష్ తదితర నేతలతో కలిసి నందమూరి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ..
”తెలుగువారి ఆత్మగౌరవం కోసం దివంగత ఎన్టీఆర్ ఎంతగానో తపించారని కొనియాడారు. ఆయన మాదిరిగా విలక్షణ, విభిన్న పాత్రలను పోషించడం, ప్రేక్షకులను మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదని శ్లాఘించారు. తన చిత్రాలతో సమాజాన్ని ప్రభావితం చేశారని వివరించారు. ఆయన ఆశయాల సాధనకు టీడీపీ కృషి చేస్తుందని వివరించారు. ఎన్టీఆర్ ఎక్కడున్నా అమరావతిని చూసి ఆనందపడేలా రాజధాని నిర్మాణానికి టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాజధాని ఏర్పాటు అగమ్యగోచరంగా మారిందని, అమరావతి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ వద్దని చెబుతున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నదని ధ్వజమెత్తారు. దాని వల్ల అనేక నష్టాలు వాటిల్లనున్నాయని వెల్లడించారు. అమరావతిని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి ప్రతి ఒక్కరి నినాదం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.