టీడీపీ మేనిఫెస్టో ఏపీలో ఇంత కాక రేపుతోందా… ఎంత సంచ‌ల‌నం అంటే…!

టీడీపీ ప‌సుపు పండుగ మ‌హానాడును రాజ‌మండ్రిలో రెండు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ రెండు రోజుల్లో తొలి రోజు క‌న్నా కూడా రెండో రోజుల అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు పోటెత్తారు. ఈ రెండు రోజుల కార్య‌క్ర‌మంలో మ‌హానాడును ఆల్ రౌండ్ హిట్ చేసిన కొన్ని కీల‌క అంశాలు ఉన్నాయి. వాటిపై.. ప్ర‌జ‌ల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

1) మినీ మేనిఫెస్టో: ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టో దుమ్ము దులిపేసింది. అంచనాలకు అందని విధంగా, అనూహ్యంగా ప్రకటించిన ఈ పథకాలు.. మహానాడు పండుగను నిజంగానే పండగ చేశాయి. ఒక్కో పథకం గురించి వినగానే పెద్దఎత్తున కార్య‌క‌ర్త‌లు, అభిమానులు హర్షధ్వానాలు చేశారు. `మ‌హిళ మహాశక్తి` పథకాన్ని వివరిస్తుంటే చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ప్ర‌క‌టించిన‌ప్పుడు మ‌హిళల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది.

2) ఉచిత ప్ర‌యాణం: జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీకి కూడా భారీ స్పందన వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు చెప్పిన లెక్కలతో ప్రస్తుతం జగన్‌ ఇస్తున్న డబ్బులను పోల్చుకుని.. జగన్‌ పని అయిపోయిందంటూ ఒకరికొకరు చెప్పుకొన్నారు.

3) యువ‌గ‌ళం: యువగళం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తానని అనగానే.. యువ‌త ఈల‌ల‌తో ప్రాంగ‌ణాన్ని హోరెత్తించారు.

4) రైతులు: అన్నదాతలకు బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.20 వేలు అనగానే.. కొందరు కార్యకర్తలు ఏకంగా చొక్కాలు విప్పేసి గాల్లో ఊపారు.

5) కార్మికులు: కార్మికుల హక్కుల పరిరక్షణకు, శ్రామికుల సంక్షేమానికి టీఎన్టీయూసీ నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘరామరాజు రూపొందించిన ‘కార్మిక దేశం’ వార పత్రికను చంద్ర‌బాబు ఆవిష్కరించారు. దీనిపైకార్మిక వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

6) భోజ‌నాలు: మహానాడు ఫుడ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల భోజ‌నాల‌పై ప్ర‌జ‌ల నుంచి వ‌హ్వా! అనే స్పంద‌న వ‌చ్చింది. పది స్టాల్స్‌ ద్వారా లక్ష మంది వరకు భోజనాలు పెట్టారు. సంఖ్య పెరిగిపోవడంతో అప్పటికప్పుడు మరో 50వేల మందికి వంటా వార్పు చేశారు. వెజిటబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ, సాంబారు రైస్‌, పెరుగు అన్నం, చక్రపొంగలి, మజ్జిగ ప్యాకెట్‌ అందించారు. మొత్తంగా ఈ అంశాలు మ‌హానాడుకు హైలెట్‌గా నిలిచాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.