రాసిపెట్టుకోండి.. కార్తికేయ -2 సూపర్ హిట్.. పాన్ ఇండియా రైటర్ ధీమా..!

హ్యాపీ డేస్ సినిమా తో తెలుగులో చక్కటి గుర్తింపు పొందిన నటుడు నిఖిల్. యువత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నిఖిల్ ఆ సినిమా నుంచి వైవిధ్య భరితమైన సినిమాలు తీస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తికేయ సినిమాతో కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాను నిఖిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా తెరపైకి రానుంది. దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘సినిమా ముందస్తు వేడుకలకు హాజరు అవ్వాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా బాగుంది..అని చెప్పాల్సి వస్తుంది.

కానీ కార్తికేయ 2 సినిమా మాత్రం అలా కాదు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ గా నిలుస్తుంది. నిర్మాతలూ.. రాసిపెట్టుకోండి ఈ సినిమా తెలుగులో ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో హిందీ లోనూ అంతే వసూళ్లు సాధిస్తుంది’ అని విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. కార్తికేయ సినిమాను హిందీలో డబ్ చేయగా యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించింది. దీంతో ఉత్తరాది లోనూ ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకొని దీనిని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించి విడుదల చేస్తున్నారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags: actor nikhil, karthikeya 2 movie, tollywood news