జక్కన్న సినిమా అంటేనే సెన్సేషనల్. రాజమౌళి తెరకెక్కించిన చిత్రంలో ట్విస్టులకు ఏ మాత్రం కొదవ ఉండదు. అదే విధంగా ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది మొదలు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకూ, ఆపైన రికార్డులపై ట్విస్టులపై ట్విస్టులు చోటుచేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ప్యాన్ ఇండియా లెవల్లో కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజుల కథలతో సోషల్ ఫాంటసీ నేపథ్యంతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికలో భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తయిన సంగతి తెలిసిందే. బాలివుడ్ నటుడు అజయ్‌దేవగణ్ కీలక పాత్రను పోషించనుండగా ఆ సన్నివేశాల చిత్రీకరణ సైతం పూర్తయింది. విశాఖ మన్యంలో చిత్రం పతాక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన వేళ ఈ చిత్రాన్ని 2020 జూన్ 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించాడు దర్శకుడు జక్కన్న. అయితే అనుకున్న సమయానికి ఈ విడుదల కాకపోవచ్చని మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదీగాక చిత్రం విడుదల తేదీ మారుతున్నందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడ్డాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ చిత్ర బృందం సినిమా విడుదల తేదీని మార్చింది. 2021 జనవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అయనప్పటికీ అభిమానులు మాత్రం ఏ మాత్రం నిరాశ చెందడం లేదు. లేటుగా వచ్చినా లేటస్లుగా వస్తారని నందమూరి, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.