కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్..!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విసిరిన ఓ ఛాలెంజ్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అయితే ఇది రాజకీయాలకు సంబంధించినది మాత్రం కాదు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ విసిరారు.

అయితే మంత్రి కేటీఆర్ చేసిన ఈ ఛాలెంజ్ ను నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ స్వీకరించారు. కేటీఆర్ ట్వీట్ కి బదులుగా మరో ట్వీట్ చేశారు. ‘రామ్ భాయ్ ఛాలెంజ్ స్వీకరించాను. చేనేతలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నా.’ అని పవన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు.పవర్ లూమ్ లు నడుపుతున్న నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాట పడుతుందని సీఎం చెప్పారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని గుర్తించి ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతు బీమా లాగే చేనేత కార్మికులకు కూడా బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామని వెల్లడించారు.

చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా చేనేతలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేస్తం నేస్తం మూడో విడత సాయాన్ని ఈ నెల 10వ తేదీన అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు రూ.24 వేల సాయం అందనుంది.

Tags: ktr, Pawan kalyan, telangana, trs ktr