చంద్ర‌బాబు టాస్క్‌తో జ‌గ‌న్ ఉక్కిరి బిక్కిరి… దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయిపోయిందిగా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనూహ్యంగా ప్ర‌క‌టించిన తొలిద‌శ లేదా ప్రాథ‌మిక మేనిఫెస్టో.. అధికార పార్టీ వైసీపీకి పెద్ద‌టాస్క్‌గా మారింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి ఎన్నిక‌ల‌కు ప‌ది మాసాల ముందుగానే చంద్ర‌బాబు ఇలా మేనిఫెస్టో ప్ర‌క‌టిస్తార‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ, ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇది చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ప్ర‌క‌టించిన మేనిఫెస్టోగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ముందుగానే త‌మ ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏమేం చేస్తార‌నే విష‌యాల‌ను ఆయ‌న పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. విస్తృత సామాజిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న అడుగులు వేశారు. మ‌హిళా ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌చందంగా.. మ‌హిళ మ‌హాశ‌క్తి పేరుతో వెల్ల‌డించిన ప‌థ‌కంలో నాలుగైదు ప్ర‌యోజనాల‌ను చేర్చారు.

18 ఏళ్లు నిండిన యువ‌తి నుంచి 80 ఏళ్ల వృద్ధురాలి వ‌ర‌కు కూడా .. తామే బాధ్య‌త తీసుకుంటామ‌ని చం ద్రబాబు చెప్పుకొచ్చారు. ఇది ఒక సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. చంద్ర‌బాబు కానీ..టీడీపీ కానీ..గ‌తంలో ఒకేసారి ఇంత‌గా మ‌హిళ‌ల‌పైకుమ్మ‌రించింది లేద‌నే ప్ర‌చారం చేస్తున్న వైసీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. మరీ ముఖ్యంగా అమ్మ ఒడిని త‌ల‌ద‌న్నేలా మాతృ వంద‌నం కార్య‌క్ర‌మంలో ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ 15000 ఇస్తామ‌ని చెప్పారు.

అంటే..ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ చెబుతున్న‌.. చెప్పుకొంటున్న కీల‌క‌మైన ప‌థ‌కం అమ్మ ఒడి విష‌యంలో ఆ పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు డిఫెన్స్‌లో ప‌డేశార‌నే వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు(2019) ముందు జ‌గ‌న్ ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. అమ్మ ఒడి ఇస్తామ‌ని త‌ర్వాత‌.. ఒక్క‌రికే ప‌రిమితం చేయ‌డం.. ప్ర‌జ‌ల్లో క‌ల‌క‌లం రేపింది.

 

దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు వేసిన అడుగు మ‌హిళా ఓటు బ్యాంకును గుండుగుత్త‌గా టీడీపీవైపు మ‌ళ్లించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఈ మేనిఫెస్టో జ‌గ‌న్‌, వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంద‌న్న‌ది వాస్త‌వం. దీంతో వైసీపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది