స్టార్ హీరోల కెరీర్‌లో చెత్త రికార్డులు బ్రేక్ చేసిన డిజాస్ట‌ర్లు ఇవే…!

టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో డిజాస్టర్ కథలు ఎప్పటినుంచో ఉన్నాయి. కోట్ల రూపాయలు పెట్టి సినిమాల తీసేసే నిర్మాతలకు అలాంటి కథలు వారికి ఎన్నో నష్టాలు కలిగిస్తాయి. లైగర్ నష్టాలు భ‌ర్తీ చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. గత సంవత్సరం ఆచార్య వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ నడిస్తే ఆ వివాదాలు సెటిల్ చేయడానికి దర్శకుడు కొరటాల నెలల సమయం తీసుకున్నాడు.

ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఏజెంట్, శాకుంత‌లం సినిమాల పరిస్థితి కూడా ఇదే. ఇలాంటి కథలు ఇలాంటి వ్యథలు టాలీవుడ్ కి కొత్త ఏమీ కాదు. ఎప్పటినుంచో బాక్సాఫీస్ చరిత్రలో ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి హీరోకి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు జానీ, అజ్ఞాతవాసి సినిమాలు ఓ పీడ కల మిగిలిపోయాయి. చిరంజీవికి మృగ‌రాజు సినిమా పీడ‌క‌ల‌. ఈ సినిమా త‌ర్వాత నిర్మాత కె దేవివ‌ర‌ప్ర‌సాద‌కు ఇండ‌స్ట్రీకి దూర‌మైపోయాడు.

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో కూడా ఒక్క‌మ‌గాడు సినిమా భారీ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌదరి మళ్ళీ అగ్ర హీరోలను కలుసుకోలేకపోయాడు. ఇక నాగార్జ‌న న‌టించిన ర‌క్ష‌కుడు కూడా నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ఎన్టీఆర్ శ‌క్తి సినిమా కూడా తార‌క్ కేరీర్‌లోనే భారీ డిజాస్ట‌ర్ సినిమా గా మిగిలిపోయింది. ఈ సినిమా ద‌గ్గ‌ర నుంచి ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా వ‌చ్చే వ‌ర‌కు స‌రైన హిట్ అందుకోలేక‌పోయాడు.

అఖిల్ తొలి సినిమా కంటెంట్ తో పాటు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచి నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. నిర్మాతల‌తో మొదలుపెట్టి ఎగ్జిబిటర్ దాకా అందరిని బాధించిన ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఖర్చు మీద అదుపు లేక, నాసిరకం కథల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లిన ప్రతిసారి అందరూ ఇలాంటి దెబ్బలు తిన్నవాళ్ళే.