ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టాల రద్దుకు సంబంధించి ఎంత ముందుకు వెళ్లున్నా విపక్ష నేతలు అడ్డుకుంటూనే ఉన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసన మండలిలో ప్రవేశపెట్టకుండా ఇప్పటికే విపక్ష టీడీపీ అడ్డుకున్న విషయం తెలిసిందే. మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలతో ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. ఆ కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని ఆయా రాజకీయ పార్టీలకు లేఖలను సైతం రాశారు. ఈ పరాభవంతో ఏకంగా మండలిని రద్దు చేస్తున్నట్లు వైసీపీ తీర్మానించింది. మరోవైపు ఓటింగ్ జరగలేనందున అసెంబ్లీ అధికారులు కూడా ఆ బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక అంతా సజావుగా సాగుతున్నదని, బిల్లులను ఆమోదించుకోవచ్చని సీఎం జగన్ వర్గం భావిస్తున్నది. కానీ ఆయనకు ఊహించని షాక్ తగిలింది. మళ్లీ కథ మొదటికొచ్చింది.
విపక్ష టీడీపీతోపాటు బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సెలక్ట్ కమిటీకి తమ సభ్యుల పేర్లను సూచిస్తూ మండలి చైర్మన్‌కు లేఖలను రాశాయి. దీంతో వైసీపీ ప్రస్తుతం ఇరకాటంలో పడింది. మండలిని రద్దు చేసిన అనంతరం సెలక్ట్ కమిటీ ఉండదని వాదించినా ఆ దిశగా విపక్ష పార్టీలు ముందుకు సాగడంతో ఏదీ తోచని స్థితిలోకి పడిపోయింది. ఇప్పటి వరకు సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపడాన్ని బీజేపీ, పీడీఎఫ్ కూడా వ్యతిరేకించాయని తెలిపినా, తాజాగా ఆ రెండు పార్టీలు కూడా తమ సభ్యుల ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా సెలక్ట్ కమిటీలో రెండు బిల్లులకు సంబంధించి టీడీపీ బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, దీపక్‌రెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, బుద్ధ నాగేశ్వర్‌రావు, నారా లోకేష్, తిప్పేస్వామి, అశోక్‌బాబు, బీటీనాయుడు, సంధ్యారణి పేర్లను, బీజేపీ సోము వీర్రాజు, మాధవ్, పీడీఎఫ్ వెంకటేశ్వర్‌రావు, లక్ష్మణ్‌రావు పేర్లను సూచిస్తూ చైర్మన్‌కు లేఖలను రాశాయి. ఇక వైసీపీమాత్రం మండలిని రద్దు చేసిన అనంతరం సెలక్ట్ కమిటీ ప్రసక్తే లేదని బల్ల గుద్ది వాదిస్తున్నది. దీంతో ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది.