ఏపీ రాజధాని అమరావతిపై హైపవర్‌ కమిటీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏర్పాటుపై హైపవర్‌ కమిటీ మూడోసారి సమావేశమైందిన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నిరసనలు, రాజధాని ప్రాంత రైతులు, మహిళల ఆందోళనలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైపవర్‌ కమిటీ మూడోసారి సమావేశమైంది. మొదటి సారి సమావేశమైన హైపవర్‌ కమిటీ ముఖ్యంగా జీఎస్‌ రావు ఇచ్చిన నివేదికపైనే పూర్తిగా దృష్టి సారించింది. రెండో సమావేశంలో రైతుల ఆందోలనలు, సచివాలయాల ఉద్యోగులు తదితర అంశాలపై చర్చించింది. ఇక సోమవారం మూడో సారి నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా జిల్లాలో అభివృద్ధిపైనే దృష్టి సారించింది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. రాజధాని ప్రాంత రైతులకు తమ అభిప్రాయాలను మరోసారి తెలిపేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 17వ తేదీలోగా రైతులు తమ విన్నపాలను రాతపూర్వకంగా సీఆర్జీఏకు అందజేయాలని వెల్లడించింది. అదీగాక ఈమెయిల్‌ ద్వారా కూడా తమ సందేహాలను, సూచనలను తెలపవచ్చని హైపవర్‌ కమిటీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు పేర్ని నాని, కన్నబాబు ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రీప్లాన్‌గా ధర్నాలను చేస్తున్నారని వారు ఆరోపించారు. అందుకోసం మహిళలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను, ప్రజలను తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో ఆందోళలను చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి పొందడం కోసమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని వారు విమర్శించారు. ఇకనైనా చర్యలు మానుకోవాలని హితవుపలికారు.

Tags: ap capital amaravathi, high power comitee third meeting, ministers