ఏపీ సర్కార్ తమకు వ్యతిరేకంగా ముందుకు వెళుతోన్న ఆ మూడు ఛానెల్స్‌పై బ్యాన్ కంటిన్యూ చేస్తోంది. కనీసం ఆ ఛానెల్స్ ప్రతినిధులను అసెంబ్లీ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. తాజాగా ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయయాయి. ఈ క్రమంలోనే ప్రత్యక్ష ప్రసారాల కోసం ఆ మూడు ఛానెల్స్‌ను నిరాకరిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిషేధం విధించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానళ్లలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు రావడం లేదు. చివరకు ఈ మూడు ఛానెల్స్ ఐ & పీఆర్ ఇచ్చే లైవ్ ఫుటేజ్ కూడా వాడుకోకూడదని మరీ స్పీకర్ ఆదేశించారు.
ఇక ఈ మూడు ఛానెల్స్ లైవ్ వెహికల్స్ కాని.. ఛానెల్స్ ప్రతినిధులు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని నిషేధం విధించారు. ఇప్పటికే ఏపీలో మీడియా ఛానెల్స్‌పై ప్రభుత్వం అప్రకటిత బ్యాన్ విధించడంతో పెద్ద రచ్చే నడిచింది. ఏబీఎన్ అయితే దీనిపై పెద్ద ఎత్తున పోరాటం కంటిన్యూ చేస్తోంది. ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోకి కూడా ఈ మూడు ఛానెల్స్ రాకూడదని స్పీకరే స్వయంగా నిషేధం విధించడంతో ప్రభుత్వంపై రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ మూడు ఛానెల్స్ తప్పుచేశాయని.. అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘించాయని చెపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీ నుంచి సస్పెండై బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఈ ఛానెల్స్ లైవ్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ నిబంధన బేస్ చేసుకుని ఈ మూడు ఛానెల్స్‌పై నిషేధం విధించారు. అంతెందుకు మిగిలిన ఛానెల్స్ కూడా అదే టైంలో లైవ్ ఇచ్చాయి. అయితే అవి ప్రభుత్వానికి ఫేవర్‌గా ఉండడంతో ఆ ఛానెల్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటోంది. ప్రభుత్వానికి బలమైన మెజార్టీ ఉంది. ప్రజలంతా జగన్ వైపే ఉన్నారన్న ధీమా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు.. మీడియాను అణగదొక్కాలనుకోవడం ప్రజల్లో చులకనకు కారణమవుతాయి. ఇలాంటి చర్యలను ఎవరు చేసినా ఖండించాల్సిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనూ రెండు ఛానెల్స్‌ను టార్గెట్ చేశారు. దీనిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు అర్థం ఉండదు కదా..!
గతంలో రాజశేఖర్‌రెడ్డి సైతం మీడియాను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఓ జీవో తెచ్చినా తర్వాత ఈ విషయంలో వెనక్కు తగ్గారు. ఇక ఇప్పుడు ఈ మూడు ఛానెల్స్ చేసింది చాలా చిన్న తప్పు.. అయితే ఒక రోజుకో.. రెండు రోజులకే పరిమితం కావాల్సిన బ్యాన్‌ను ఏకంగా మరుసటి అసెంబ్లీ సమావేశాలకు కూడా కంటిన్యూ చేయడం దారుణం. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షిలో ఎన్నో ఘోరమైన రాతలు కూడా వచ్చాయి. అయితే అప్పుడు స్పీకర్ మాత్రం సాక్షి మీడియాను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోలేదు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. మరి మీడియాను అణగదొక్కే చర్యలకు అడ్డకట్ట వేసేలా కేంద్రస్థాయిలో చట్టం వస్తే తప్ప ఇలాంటి విషయాలకు బ్రేక్ పడేలా లేదు.